Ponganaalu

పొంగనాలు – భారతీయ తాత్త్విక చింతన.

పొంగనాలు – భారతీయ తాత్త్విక చింతన.

నిన్నటి నా పొంగనాలు పోస్ట్ చూసి స్పందించిన మిత్రులు దానికి గల అనేక పేర్లను పేర్కొన్నారు.పులిబొంగరాలు,గుంతపొంగడాలు,పణియారం,పడ్డు,పులుంటలు…..
(ఉన్నది ఒకటే సత్యం ,దాన్ని ఒక్కొక్కరు ఒకలా నిర్వచించారు,నీళ్ళను నీరు,పానీ,తనీరు,వాటర్….దీన్నే వేదాంత పరిభాషలో “ఏకం సత్ విప్రా బహుదా వదంతి” అంటారు.)

Ponganaalu
Ponganaalu
Guntha Ponganaalu - tiffin
Guntha Ponganaalu – tiffin
తయారీ విధానం.
ముందుగా మినప్పప్పు,బియ్యం కలిపి పిండిగా తయారు చేస్తే దోశ పిండి తయారవుతుంది.
(జీవాత్మ,పరమాత్మల కలయిక ,అప్పుడు రెండు అనే భావం పోయి ఒకటే ఉంటుంది.ద్వైతం(రెండు) కానిది అదే “అద్వైతం”)
ఇప్పుడు ఆ పిండితో మీరు దోసలు,ఊతప్పాలు,పొంగనాలు చేసుకోవచ్చ్హు.
(ఆత్మ సత్వ,రజో,తమో అనే మూడు గుణాలను ఆశ్రయించి భూమి మీదకు రావటం.)
పిండిలో ఉల్లిముక్కలు,సన్నగా తరిగిన పచ్చిమిర్చి(మిర్చి పేస్ట్ అయినా),ఉప్పు,అరగంట సేపు నానబెట్టిన సెనగపప్పు కలుపుకోవాలి.
(పంచభూతాల మిశ్రమం తో ఆత్మ దేహంగా మారటం మొదలవుతుంది)
ఇప్పుడు స్టవ్ మీద పెన్నం పెట్టి అందులో నూనె వెయ్యాలి.
(ఇది జీవి జన్మకు అవసరమైన తల్లిదండ్రుల లాంటిది)
ఇప్పుడు పిండిని పెన్నం లోని గుంటల్లో పోయాలి.
(జీవికి ఊపిరులూది నవరంద్రాలున్న శరీరంలో ఆత్మ ప్రవేశించడం,పెన్నాం లోనూ 9 గుంటలే ఉంటాయి)
బాగా బ్రౌన్ కలర్ వచ్చేవరకూ తిప్పుతూ వేయించుకోవాలి.
(తల్లి గర్భం లో నవమాసాలు కదులుతూ,తిరుగుతూ ఉండే గర్భస్త శిశువన్నమాట)
వీటిని తిప్పటానికి,బయటికి తియ్యటానికి ఒక దబ్బనం లాంటి పరికరమో,చాకు నో ఉపయోగించాలి.
(వేదన,రోదన లేకుండా జీవుడు బయటికి రాడు)
ఇప్పుడు తయారైన దాని cassarole(hotbox) లో వెయ్యాలి,ఇలా అన్నిటినీ బాక్స్ లో వేయ్యండి.
(రావడం ఒక్కరుగా వచ్చినా మీతో సమాజం తోడవుతుంది)
ఇప్పుడు వాటిని డైనింగ్ టేబుల్ మీదకు చేర్చండి.ఆకర్షణీయమైన,మంచి సైజ్,షేపు ఉన్న పొంగనాలు రెడీ.
(నీకంటె నేను దానిలో దీనిలో గొప్ప అనుకునే వింత మనుషుల్లా..)
ఇప్పుడు ప్లేట్ లో పెట్టుకుని మీకిష్టమైన చట్నీ తో తినెయ్యండి.
(ఇక్కడితో ఆ జీవుడి ప్రయాణం అంతం)
బాగా నమిలి ఆ రుచిని ఆస్వాదిస్తూ తినండి.
(ఇక మీరు చేసిన తప్పొప్పుల ఆధారంగా గరుడపురాణం లోని శిక్షలు.మీ 32 పళ్ళే ఆ శిక్షను అమలుచేసేది)
ఇది జంబూ ద్వీపంలో భరత ఖండం,భరత వర్షంలో,మేరు పర్వతానికి దక్షిణ భాగంలో,కృష్ణాగోదావరి మధ్య ప్రదేశంలోని శ్రీశైల సమీపానున్న నల్లమల అడవుల్లోని ఒక గుహలో “శ్రీశ్రీశ్రీ జిహ్వానంద” స్వాములవారు బోధించిన “పొంగనవేదాంతసారం”.నాడు తనకు గురువుపదేశించిన “అష్టాక్షరి” మంత్రం ద్వారా జనులందరు కూడా తరించాలని ఆలయ గోపురం పైనుండి బిగ్గరగా చెప్పిన “రామానుజాచార్యులు” వారి ప్రేరణతో నేను మీకు దీన్ని తెలుపుతున్నాను.
ఇది చేసుకున్నవారు,తిన్నవారు జన్మసాఫల్యతనొందుదురు గాక.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top